‘యుగపురుషుడు ఎన్.టి.ఆర్’

0
30

‘యుగపురుషుడు ఎన్.టి.ఆర్’

NTR…… పేరు కాదు బ్రాండ్. తెలుగు ప్రజల అభిమాన నటుడు. నాయకుడు. తెలుగు సినిమా ప్రపంచంలో రారాజు. ఏ పురాణ పాత్రైనా, సాంఘికమైనా, చారిత్రకమైనా అసలు నాయకులు ఎలా ఉంటారో తెలియనివారికి వారి పాత్రలో గుర్తుకొచ్చేది ఎన్.టీ.యార్ రూపమే. దేవుడున్నాడో….. లేడో…. కానీ తెలుగునాట రాముడైనా…. కృష్ణుడైనా…. రామారావే. ఇంకే దేవుడైనా ఆయనే. ఆయన బొమ్మతోనే పూజలు చేసే సందర్భాలున్నాయి.  ఇప్పటికీ తెలుగు ప్రజలలో అత్యంత జనాదరణ ఉన్న వ్యక్తిగా ఎన్.టి.రామారావే ఉన్నారు. ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయగలగడం సాధ్యమా?! అన్నంతగా ‘అన్నగారు’ గా ఆయనకు తెలుగు ప్రజలు బ్రహ్మరధం పట్టారు.

ఎన్నో దేవుళ్ల పాత్రలు పోషించి ప్రజలలొ దేవుడిగా గుర్తింపు పొందినా ఆయన సనాతనవాది కాకపోవడం ఓ వింతగానే చెప్పాలి. ఆయన ప్రగతిశీలవాదిగానే ఉండేవారు. గుళ్లూ..గోపురాలు చుట్టూ తిరిగే సందర్భాలు చాలా తక్కువ. పుట్టపర్తి సాయిబాబా కాళ్లకు మొక్కని ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా ఎన్.టీ.ఆర్ పేరు చెపుతుంటారు. ఆయన జీవితంలో ఎన్నొ సంఘటనలు ఎన్.టీ.ఆర్ ప్రగతిశీలతకు ప్రతీకగా నిలుస్తాయి.

రాజకీయాలలోనూ NTR సంచలనమే. పార్టీ పెట్టిన 9 నెలలలో అధికారాన్ని చేపట్టిన ఆయన రికార్డును ఎవరూ అధిగమించలేదు. పాలనలో సంస్కరణలు, మొండిగా…. దూకుడుగా…. సంక్షేమ పథకాలతో పేద ప్రజల పక్షం వహించిన నేతగా ఇప్పటికీ ఆయన ఎందరికో ఆదర్శంగా నిలిచారు. రాజకీయాలలో ఓనమాలు తెలియని వ్యక్తిగా ఉండే రామారావు నటుడిగా తనను ఆదరించిన తెలుగు జాతికి ఎదో చేయాలన్న తపనతో రాజకీయ ప్రవేశం చేసి ఎందరో కొత్త నాయకులకు రాజకీయ ఓనమాలు నేర్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.సి.ఆర్, చంద్రబాబులు ఎన్.టి.ఆర్ చలువతోనే ఎదిగారు. మంత్రులలోనూ చాలామంది ఉన్నారు. NTR వలన రాజకీయంగా ఎదిగినవారి  లిస్టు చాలా పెద్దదే.

అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి.అంజయ్య ఎన్.టీ.ఆర్ పేరును రాజ్యసభకు ప్రతిపాదించడం… ఇందిరాగాంధి ఆమోదించడం జరిగాయి. అంజయ్యకు సైతం తెలీకుండా ఓ జర్నలిస్టు కారణంగా చివరి నిమిషంలో లిస్టులో ఆఖరిది

గా ఉన్న ఎన్.టీ.ఆర్ పేరు రద్దయింది. ఇది తెలియని ఎన్.టీ.ఆర్ మద్రాస్ నుండి హైదరాబాద్ కు రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు వచ్చారు. ‘ఆత్మ గౌరవం’ కు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఎన్.టీ.ఆర్ రాజకీయ ప్రవేశ నిర్ణయం వెనుక ఈ సంఘటన కూడా కారణమంటారు.

ఆనాడు పెద్దలసభకు పోయి ఉంటే ఈ పెద్దాయన సృష్టించిన రాజకీయ చరిత్ర ప్రపంచం కోల్పోయేదే. ఇందిర ఇస్తే రాజ్యసభ సీటు పుచ్చుకునే స్థితినుండి తానే అనేకమందికి సీట్లు ఇచ్చే స్థితికి ఎదగడం…. ఆ ‘ఇందిర’ రాజకీయ జీవితంపైననే ప్రభావం చూపే వ్యక్తిగా రూపొందడం యాధృచ్చికమే అయినా అపూర్వం. ‘భారత్’లో అత్యంత శక్తివంతమైన నేత ఇందిరాగాంధీకి సైతం చుక్కలు చూపించిన అసలు సిసలు ప్రజా నాయకుడుగా ఎన్.టీ.ఆర్ ను ప్రజలు కాపాడుకున్నారు. 

ఎన్.టి.ఆర్ జీవితంలోని అలాంటి అనేక విశేషాలను ‘జనవిజయం’ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మీలోనూ ఆయన గురించిన విశేషాలు తెలిసినవి ఉంటే మాకు పంపండి. ‘యుగపురుషుడు ఎన్.టి.ఆర్’ పేరుతో అన్నింటినీ ఒకే వేదికగా నేటితరంకు అందించే ప్రయత్నం చేద్దాం. అడుగడుగునా ఉత్తేజం, ప్రేరణ, స్పూర్తిని కలిగించే నందమూరి జీవిత విశేషాలను అందరం కలసి ప్రపంచానికి అందిద్దాం. ఎన్నో విజయాలు, విశేషాలు, రికార్డులు ఆయన స్వంతం. ఎన్.టీ.ఆర్ గురించిన విశేషాలు, ఆయనతో మీకున్న అనుబంధం, ఆయనపై మీకున్న అభిమానం, ఆయనలో ఆదర్శం అనిపించిన అంశాలు…… ఇలా ఎన్.టీ.ఆర్ గురించి మీరు కూడా ఏమి వ్రాయదలచుకున్నా మాకు పంపండి. మీ ఫోటో, వివరాలు జత చేయండి.

mail id : janavijayam@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here