VRK Diet సందేహాలు – సమాధానాలు (1)

0
71

వీరమాచనేని రామకృష్ణారావు ఆహార విధానం అనుసరిస్తున్నవారు, ప్రారంభించాలనుకుంటున్నవారు, ఈ విధానం తెలుసుకోవాలనుకుంటున్నవారు మీ సందేహాలను మాకు వ్రాయండి. మీ ప్రశ్నలకు వీరమాచనేని రామకృష్ణ స్వయంగా సమాధానాలు ఇస్తారు. మీ ప్రశ్నలను క్రింద సూచించిన మెయిల్ ఐడీ లకు పంపించండి. 

1) janavijayam@gmail.com  2)  kondalarao.palla@gmail.com 
         వీరమాచనేని రామకృష్ణారావు తో “జనవిజయం” ఎడిటర్ పల్లా కొండలరావు
సందేహాలు – సమాధానాలు
ప్రశ్న 1: మీరు చెప్పిన నియమిత కాలపు ఆహార విధానం అనుసరిస్తున్నపుడు డయాబెటిస్‌ ఉన్నవారికి వణుకు వస్తే ఏమి చేయాలి?
వీరమాచనేని : ఇది పెద్దగా భయపడాల్సిన అంశం కాదు. ఇలా జరగడం సహజం. మన శరీరం ఇప్పటిదాకా అలవాటు పడిన ఆహారం కాకుండా మార్పు చేస్తున్నందున మొదట్లో ఒక వారం పాటు వ్యక్తులను బట్టి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్‌ లేనివారికి కూడా వణుకు రావచ్చు. ఇంకా….వాంతులు, విరేచనాలు, కళ్ళు తిరగడం, తలనెప్పి, చర్మంపై ఎలర్జీ రావడం వంటివి జరుగుతాయి. ఇవి శరీరం మెటబాలిలిజం మార్పు చెందుతున్నపుడు కనపడే లక్షణాలు మాత్రమే. ఇది చెడ్డ అంశం కాదు. ఉదాహరణకు గర్భిణీ స్త్రీలకు వాంతులు కావడం వంటిదే ఇది కూడా. వారం తరువాత కూడా అలా జరుగుతుంటే ఆయా బాధలకు మామూలుగా వాడే అల్లోపతి మందులను సమస్య తగ్గేదాక వైద్యుని సలహాతో వాడండి. ప్రోగ్రామ్‌ లో ఉండగా హోమియో, ఆయుర్వేదం మందులు మాత్రం వాడవద్దు.
ప్రశ్న 2 : ఈ విధానంలో డయాబెటిస్‌ తో బాధపడేవారికి ఎంత తిన్నా ఇంకా ఆకలి వేస్తుంటే ఏమి చేయాలి?
వీరమాచనేని : ఏ తప్పు చేయకుండా సరిగా ఆచరణ ఉంటే ఈ విధానంలో ఆకలి వేయడం అంటూ ఉండదు. ఈ విధానంలో ఎంత తిన్నా ఆకలివేయడం అనే సమస్య వస్తుందంటే ప్రోగ్రాం ఆచరణలో ఏదో తప్పు చేస్తున్నారని అర్ధం. అపుడు మీరు చేస్తున్న విధానంను లోతుగా సమీక్షించుకుని తప్పును సరిచేసుకోవాల్సి ఉంటుంది.
ప్రశ్న 3 : బరువు త్వరగానూ, ఎక్కువగానూ తగ్గించాలనుకునే వారు (అధికబరువు) చేయాల్సిన ప్రత్యేకతలు ఏమిటి?
వీరమాచనేని : మన విధానంలో అవసరం మేరకు నిబంధనల సరిగా పాటించి లిక్విడ్‌ ఫాస్టింగ్‌ చేయాలి. అధికబరువు సమస్య ఉన్నవారు లిక్విడ్‌ ఫాస్టింగ్‌ వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
ప్రశ్న 4 : ఈ విధానంలో కొబ్బరినూనెను తప్పనిసరిగా వాడాల్సిందేనా?
వీరమాచనేని : అవసరం లేదు. ప్రత్యామనయంగా ఫ్యాట్‌ కోటాలో సూచించిన మిగతా ఆహారం వాడుకోవచ్చు.
ప్రశ్న 5 : కొబ్బరినూనెను ఒకేసారి త్రాగవచ్చా?
వీరమాచనేని : వద్దు. ఒకేసారి కాకుండా రోజులో మీరు తీసుకోవాలనుకున్న కొలత మొత్తాన్ని సమ భాగాలుగా చేసి 4,5,6 సార్లుగా సూప్‌లో, లేదా వేడినీటితో, ఇతర పదార్ధాలతో కలుపుకుని తీసుకోవడం మంచిది.
ప్రశ్న 6 : కొబ్బరినూనెను రోజులో మొత్తం కోటాను నేరుగా, ఒకేసారి త్రాగితే నష్టం ఏమిటి?
వీరమాచనేని : నేరుగా, ఒకేసారి త్రాగితే విరేచనాలు అవుతాయి. పడనివారికి ఇతర ఇబ్బందులు కొన్ని ఉంటాయి. వీటితో ప్రమాదం అని చెప్పలేము కానీ, మీరు తీసుకున్న కోటా మొత్తం జీర్ణం కాకుండానే విరేచనంతో బయటకు పోయి ప్రోగ్రామ్‌కు ఆటంకంగా మారుతుంది. ఈ ఇబ్బందులేమీ లేకుండా ఉంటుందనుకున్నవారు నేరుగా తీసుకున్నా తప్పులేదు. కానీ చాలా అరుదుగా తక్కువమందికి మాత్రమే నేరుగా తీసుకున్నా ఏ ఇబ్బందులూ ఉండకుండా ఉండడం జరుగుతుంది.
ప్రశ్న 7 : కొబ్బరినూనెను రోజులో మొత్తం కోటాను ఇన్ని భాగాలుగా అని సమంగా పంచుకుని తీసుకునేవారు ఒక్కోభాగాన్ని ఇన్ని గంటలకోసారి అని విరామం (గేప్‌) ఇచ్చి తీసుకోవాలా?
వీరమాచనేని : అలాంటి నియమం అవసరం లేదు. మీకు వీలుని బట్టి రోజు మొత్తంలో కోటాను పూర్తి చేయాల్సి ఉంటుంది తప్ప ఇన్ని గంటల లేదా ఇంత సమయం విరామం తీసుకుంటూ త్రాగాలనే నిబంధనేదీ లేదు.
ప్రశ్న 8 : ఈ విధానంలో ఫేట్‌ కోటాను 10 రోజుల తరువాత తప్పనిసరిగా తగ్గించాల్సిందేనా?
వీరమాచనేని : అవసరం లేదు. పూర్తికాలం తీసుకున్నా తప్పులేదు. 10 రోజులు పూర్తి అయ్యాక మీ బరువు, ఆకలి, నీరసం ను బట్టి ఎంత తీసుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా తగ్గించాల్సిందే అనే నిబంధన లేదు. అండర్‌ వెయిట్‌ ఉన్నవారైతే ఫేట్‌ కోటాను పెంచాల్సి కూడా వస్తుంది.
ప్రశ్న 9 : ఈ విధానం అనుసరిస్తున్నపుడు అరికాళ్ళ మంటలు వస్తుంటే ఏమి చేయాలి?
వీరమాచనేని : డయాబెటిస్‌తో బాధపడేవారికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది. అదీ తాత్కాలికంగా ఉంటుంది. పూర్తి కాలం ఆచరణ పూర్తయ్యాక మీకా సమస్య ఉండదు. కొందరిలో కాస్త నెమ్మదిగా ఈ సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ సమస్య బాగా ఇబ్బందిగా ఉంటే ప్రోగ్రాం చేస్తూనే డాక్టరు సలహా మేరకు అల్లోపతి మందులు వాడండి.
ప్రశ్న 10 : దనియాలు, యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క వంటివి నేరుగా (వక్కపొడి నమిలినట్లుగా) తీసుకోవచ్చా?
వీరమాచనేని : నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
ప్రశ్న 11 : ఈ విధానంను ఆచరించాలంటే వేసవికాలంలో ప్రారంభించేవారు తీసుకోవలసిన ప్రత్యేక జాగ్రత్తలు ఏమిటి?
వీరమాచనేని : అదనంగా మరో లీటరు నీటిని కలిపి…రోజుకు 4 కు బదులు 5 లీటర్లు నీటిని , 3 కు బదులు 4 లేదా 5 నిమ్మకాయలు తీసుకోవాలి. 1 కి బదులు 2 మల్టీ విటమిన్‌ టేబ్లెట్లు తీసుకోవాలి. ఇపుడు మనం చెప్పే దిక్కుమాలిన మజ్జిగ స్థానంలో మరో విధమైన ద్రావకం తయారు చేసుకోవచ్చు. 2 లీటర్లు పాలను తోడుపెట్టి పెరుగుగా మారాక పైన మీగడ తీసేసి మిగిలిన పెరుగులో ఒకలీటరు నీరు పోసి మజ్జిగలా తయారుచేసి పేరుకోనివ్వాలి. అపుడు పైకి తేలిన తేటవరకు ప్రక్కకు తీసి సూప్‌గా వాడుకోవచ్చు. ఇది రుచికరంగా కూడా ఉంటుంది. అవసరమైతే జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్టు, కరివేపాకులాంటివి కలుపుకోవచ్చు. మనం చెప్పే దిక్కుమాలిన మజ్జిగ త్రాగలేనివారు ఇది ప్రయత్నించవచ్చు. ఇందులో మీగడ, మిగిలిన పెరుగును డైట్‌లో లేనివారు వాడుకోవచ్చు. ఏదీ వృధా కాదు. ఈ ద్రావకం వల్ల అద్భుతమైన శక్తి వస్తుంది కూడా. ఎండాకాలంలో ఈ విధానం ఆచరించేవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
ప్రశ్న 12: లిక్విడ్‌ ఫాస్టింగ్‌ ఎన్ని రోజులు చేయాలి?
వీరమాచనేని : ఇన్ని రోజులు అనే నిబంధన లేదు. మీ అవసరం, అనుకూలతని బట్టి 5,10,15రోజులు… ఒకనెల….రెండు నెలలు ఇలా ఎంతకాలమైనా చేయవచ్చు.
ప్రశ్న 13 : ఈ విధానంను ఆచరిస్తూ మధ్యలో మానేసినవారు తిరిగి ప్రారంభించాలంటే మళ్ళీ పూర్తి కాలం చేయాలా? లేక పాతరోజులు లెక్కలోకి వస్తాయా?
వీరమాచనేని : పాతరోజులు లెక్కలోకి రావు. తిరిగి మొదటినుండి చేయాల్సిందే. అన్ని నిబంధనలు పాటించాల్సిందే. ఇలా తప్పుచేసి మానేసి తిరిగి మొదలుపెట్టాలనుకునేవారు కనీసం 5రోజులైనా లిక్విడ్‌ ఫాస్టింగ్‌ చేయడం ద్వారా ప్రారంభించడం మంచిది.
ప్రశ్న 14: వీరమాచనేని ఆహార విధానంను ప్రారంభించడానికి ముందు ఏయే మెడికల్‌ టెస్టులు చేయించాలి?
వీరమాచనేని : మొత్తం టెస్టులు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే మనకు అంచనావేసుకోవడానికి, అసలు రోగం ఉందా లేదా అన్నది తేల్చుకొవడానికి పూర్తిప్యాకేజి చేయించుకుంటే మంచిది. చిన్నపిల్లలకు షుగరు లాంటివి ఉండే అవకాశం ఉండదు కనుక వారు మినహా మిగిలినవారంతా అన్ని రకాల టెస్టులు చేయించుకుని మన విధానంలోకి వచ్చాక అవసరాన్ని బట్టి కొన్ని టెస్టులు చేయించుకుంటూ డాక్టరు సలహా మేరకు మందుల డోసు తగ్గించుకుంటూ ఉండాలి.
ప్రశ్న 15: వీరమాచనేని ఆహార విధానంను ఏ వయసు వారు అనుసరించవచ్చు? ఎవరు అనుసరించకూడదు?
వీరమాచనేని : 5 సంవత్సరాల వయసున్న పిల్లల నుండి 80 సం॥ వయసు ఉన్నవారి వరకూ వారి ఆరోగ్యసమస్యను బట్టి వైద్యుల సలహా మేరకు ఈ విధానాన్ని అనుసరించవచ్చు. ముఖ్యంగా క్రానిక్‌ డిసీజెస్‌ ఉన్నవారు దీనిని ఆచరించకుండా ఉండడమే మంచిది. బాలింతలు, గర్భిణీలు చేయకూడదు. క్రానిక్‌ డిసీజెస్‌ ఉన్న పెద్ద వయసువారు కూడా చేయవద్దు.

తదుపరి సందేహాలు-సమాధానాలు పోస్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here