ఉచిత సలహాలతో ఉపయోగమెంత ?

0
296

సలహాలు – సంగతులు !

సామెతలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయని నా అభిప్రాయం. అనుభవంలోనుండి వచ్చిన తిరుగులేని సత్యాలవి. కాకుంటే కొన్ని అవుట్ డేట్ అయినవి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంత పవర్ ఉన్న సామెతలలో నాకు నచ్చిన వాటిలో ముఖ్యమైనది

“చెప్పేవాడికి వినేవాడు లోకువ”

మనం వినాలేగానీ చెప్పడానికి రెడీగా ఉంటారు. నెత్తిమీద రూపాయి పెట్టి అమ్మినా ఐదుపైసలుకు అమ్ముడుపోని మానవులు సైతం తగుదునమ్మా అంటూ సలహాలు ఇస్తుంటారు. అందుకే “ఉచిత సలహాలు” అనే పదం ఆవిర్భవించి ఉంటుందని నా నమ్మకం.
మనం ఏదైనా పని కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్నామనుకోండి, ఇక వీళ్లు బయలుదేరుతారండి. వాళ్ల పనులు మానుకుని , ఇంట్లో తిట్లు తినైనా సరే మన బుర్రలు తినందే వదలరు. అడ్డమైన సలహాలు – నెగిటివ్ మోటివేషన్ కు తమ శక్తిమేరకు కృషి చేస్తారు.
అటు ఇటు కానివాడి పరిస్తితైతే ఇక చెప్పనే అవసరం లేదు. వాడు ఎందుకొచ్చిన గోలరా భగవంతుడా అనుకోపోతే ఒట్టు. అంత పవర్ఫుల్ మోటివేషన్ ఉంటుందీ గాంగ్ ది.
పోనీ వీరేమైనా ఆరితేరి అనుభవాలు చెపుతారా? అంటే…. అదీ ఉండదు. ఎక్కడో మనసు లోతుల్లో తమకే తెలియని ఈర్ష్య లాంటి ఓ మానసిక స్తితే ఇందుకు కారణమనేది నా అంచనా.
ఏదో అంటారే ‘వరిగడ్లో కుక్క సామెత’ అని అలా ఉంటుందండీ వీళ్ల వ్యవహారం. ఇంకో సామెతా చెప్పోచ్చు “అమ్మ పెట్టదు – అడుక్కు తిననివ్వదూ” అని. వీళ్లను మనం నిజాయితీగానే మరి ఆ పని వద్దు, ఏమి చేస్తే బాగుంటుందని అడిగితే ఒక్కడూ సలహా చెప్పలేడు. ఆ ఏముంది అందరూ బ్రతకట్లా అంటూ నిట్టూర్పులు తప్ప వీళ్లకి తెలిసింది జీరో మాత్రమే.

ప్రవాహానికి అనుగుణంగా గొర్రెల్లా వెళ్ళేవారే ఏ సమాజంలోనైనా ఎక్కువ మంది ఉంటారు. సాంప్రదాయబద్ధంగా జీవించడం వరకూ మాత్రం వీళ్లు చేయగలరు. సమస్యలు వస్తే సాహసాలు చేయడం – ఎదురీదడం చేతకాని వీళ్లు అందరికీ అదే సలహాలు ఇవ్వడమే తప్పు. అవసరం లేక పోయినా, అడగక పోయినా ‘‘ఉచిత సలహాలు’’ ఇచ్చేది తమకంటే ఎదుటివాడు ఎదిగితే ఇబ్బందనే ఓ తెలియని మానసిక ఝాఢ్యమే దీనికి కారణం అనుకుంటా.

ఇలాంటి వాటిని ఏ మాత్రం పట్టించుకోవద్దు.

1000 సార్లు బల్బును కనుగొనడంలో ఫెయిల్ అయ్యాడంటే థామస్ ఆల్వా ఎడిషన్ ఒప్పుకున్నాడా? 1000 పద్ధతులు బల్బు తయారీకి పనికి రావని కనుగొన్నానూ.. అన్నాడు.
యెస్ ! దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్.
ప్రతీదీ శాస్త్రీయంగా విశ్లేషించుకుని – తగిన ప్లాన్ చేసుకుని – గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రయత్నించడమే చేయాల్సింది.
భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం “చక్కగా అనుష్టించిన పరధర్మము కంటే, గుణము లేని దైననూ స్వధర్మమే మేలు”
ఎవడి సలహా వద్దనను కానీ, అవసరమైన సలహాలు మాత్రమే తీసుకోవాలి. అందరిదీ వినాలి. నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి.
అది మంచో – చెడో ఆచరణ ద్వారా లభ్యమయ్యే అనుభవం మాత్రమే డిసైడ్ చేస్తుంది.
చరిత్రలో ప్రతి విజేత ఇలాంటివి ఎదుర్కుంటూనే ఉంటాడు. అది విజేతగా ఎదగాలనుకునేవాడికో అవకాశం మాత్రమే.
అడగకుండా సలహాలు ఇచ్చేది ఏ పనీ లేని వాళ్లే అని గుర్తుంచుకోండి.

ఏ పనీ లేని వాళ్లు మనకేమిచెప్పే అర్హత లేనివాళ్లనీ గుర్తుంచుకోండి !!

నీకు నచ్చినది, నీవు విజయం సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఉన్నది, సమాజానికి, ప్రక్రుతికీ నష్టం కలిగించనిదేదైనా సరే విజయం సాధించేదాక నిరంతరం ప్రయత్నించడమే విజేతల లక్షణం, లక్ష్యం కావాలి.
– పల్లా కొండలరావు.

గమనిక: జనవిజయం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here