నిరంతరం నేర్చుకుందాం!

2
695

కేవలం పుస్తకాలు చదివితేనే మనకు విషయాలు తెలియాలనిలేదు. నేర్చుకోవడానికి నామోషీ ఫీల్ కాకుండా ఉంటే సమాజంలో ప్రతీ చోట మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మంచి నుండి – చెడు నుండి రెండు చోట్లా మనం నేర్చుకోవచ్చు. పరిచయస్తులతో మాట్లాడేటప్పుడు, అపరిచితులతో మాట్లాడేటప్పుడు నేర్చుకోవచ్చు. ఇతరుల సంభాషణలు లేదా చర్చలను వీక్షిస్తూ నేర్చుకోవచ్చు. రైల్వేస్టేషన్లు – బస్స్టాండ్ లలో వెయిటింగ్ చెసే సందర్భంలో, గ్రామాలలో రచ్చ బండల దగ్గర చాలా చాలా గొప్ప విషయాలు మనం అబ్సర్వ్ చేసి నేర్చుకోవచ్చు. టీ.వీ వీక్షించేటప్పుడు మనకు తెలియని, తెలుసుకోవలసిన విషయాలు నేర్చుకోవచ్చు. చర్చలో పాల్గొనే వారు కష్టపడి చదవడం ద్వారా నేర్చుకున్నవి ఉదాహరణలకోసమో లేదా చర్చల్లో అవసరం కోసమో వాల్లు చెప్పినప్పుడు ఆ కష్టమంతా పడకుండా వారి అనుభవం నుండి మనం నేర్చుకోవచ్చు. ప్రయాణాలలో బోర్ కొట్టకుండా ఏదో మేగజైన్ లేదా బుక్ చదువుకునే అలవాటు చేసుకుంటే ప్రతి పుస్తకంలో ఏదొ ఒక ఉపయోగపడే అంశం తెలిసే అవకాశం ఉంటుంది.

ఒక సినిమా చూసేటప్పుడు కొన్ని డైలాగులు అద్భుతమైన జీవిత సారాన్ని అందజేస్తాయి. అవి ఒక్కసారే వచ్చినవి కావు. ఆ రచయిత ఎంతో అనుభవంతో ఆలోచించి వ్రాసినవి. అలాగే ఎక్కడైనా వ్యవహారం సాగుతున్నప్పుడు-ఏదైనా చదివేటప్పుడు ఆ వ్యక్తుల అనుభవం మనకు ఉపయోగపడుతుంది. ఆ విషయాలు నేర్చుకోవడానికి మనకు సమయం కలసివచ్చినట్లే. ఉదాహరణకు ఈ మధ్య నేను హైదరాబాద్ వెళ్లాను అక్కడ పని మధ్యలో అనుకున్నదానికి కొంత సమయం గేప్ వచ్చింది. ఖాళీగా ఉండకుండా ‘అధినాయకుడు’ సినిమాకి వెళ్లాను. అందులో ఇంగ్లాండ్ గురించి ఓ సన్నివేశంలో క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో అయితే ఇంతవరకూ వరల్డ్ కప్ గెలవలేదు అనే విషయం తెలిసింది. ఈ విషయం చాలామందికి చాలా ఈజీగా తెలియవచ్చు. కానీ క్రికెట్ పట్ల అంతగా ఆసక్తి లేని నాలాంటివాల్లకు ఏదైనా సందర్భంలో చెప్పేందుకు ఇది ఉపయోగపడుతుంది కదా? ఒక్కో సినిమా ఒక్క డైలాగ్ తోనే ఆ సినిమా లైన్ అర్ధమవుతుంది. ఉదాహరణకు “పదిమందిని బ్రతికించడం కోసం చేసేదేదీ తప్పు కాదు” – కమల్ నాయకుడు. “వందమందికి మేలు చేయడం కోసం ఒక్కడిని చంపడానికైనా , చావడానికైనా సిద్దం” – జూనియర్ ఎన్.టీ.ఆర్ సిమ్హాద్రి.

నాకప్పుడే మన బ్లాగులలో ఎక్కడో చదివిన ఓ విషయం గుర్తుకువచ్చింది. భౌగోళికంగా మన రెండు గోదావరి జిల్లాలంత లేని బ్రిటీష్ వాడి ఇంగ్లీష్ ప్రపంచ భాషగా రాజ్యమేలడానికి తేనెలొలుకు మన తెలుగు భాష కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కావడానికి కారణం బ్రిటీష్ వాడు అప్పట్లో వ్యాపారం పేరుతో దేశాలను ఆక్రమించుకుని వలసపాలన కొనసాగించడమే కారణం తప్ప ఇంగ్లీష్ గొప్పతనం ఎంతమాత్రం కాదు. ఈ విషయాలను కేవలం విషయాలు ఎలా ఎక్కడనుండైనా నేర్చుకోవచ్చనేదానికి ఉదాహరణగా మాత్రమే చెప్పాను.

మన బ్లాగులలో కొన్ని అంశాలపై కొందరు అద్భుతం గా వ్రాస్తున్నారు. వాటిని ఫాలో కావడం ద్వారా నేర్చుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు చెప్పోచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతిదాని నుండి నేర్చుకోవచ్చు. అయితే ఆ విషయాలను అరకొరగా కాకుండా అవసరాన్ని బట్టి మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.చాలా విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. పాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోని వాల్లు అలా చేసుకున్నవాల్ల కంటే వెనుకబడడం ఖాయం. విషయాలను అప్డేట్ చేసుకోనివారు ఆయా రంగాలలో పోటీవల్ల అవుట్ డేట్ అయ్యే ప్రమాదం ఉంది. డాక్టర్లు – లాయర్లు ….. ఇలా ప్రతీ వృత్తిలో ఉన్న వాల్లు ఆయా వృత్తులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ నేర్చుకోకపోతే చాలా వెనుకబడిపోవడం ఖాయం.

సమాజంను మించిన విశ్వ విద్యాలయం లేదు. ప్రస్తుత చదువులలో కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే చదువులు నేర్పుతున్నారు తప్ప మిగతా లోక జ్ఞానం నేర్పరు. అదంతా సమాజం నుండే మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతా ఏ ఒక్కరికీ ఎప్పటికీ తెలియదు. మన జీవిత కాలం వెచ్చించినా జ్ఞానమంతా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ప్రతి జ్ఞానం ఎప్పటికప్పుడు మెరుగవుతుంది. కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. అయితే పాతది లేకుండా కొత్తది లేదు అనే సంస్కారం మరువకూడదు. నేరుచుకోవడానికి వయసుతో పని లేదు. అక్షర దీపం వంటి వయోజన విద్యా కార్యక్రమాల ద్వారా చదువు నేరుచుకుని విజయాలు సాధించిన వారున్న విషయం విదితమే.

చిన్న వాల్లనుండి , మనకంటే తక్కువ స్థాయి వాల్ల నుండి తెలుసుకునేందుకు ఇబ్బంది పడకూడదు. నామోషీ ఫీల్ కాకూడదు. ఒకరికి తెలిసిన విషయం మరొకరికి తెలియదు. అన్ని జ్ఞానాలు గొప్పవే. అన్నీ వాటి వాటి అవసరాల కోసం పనికి వస్తాయి. పీ.ఎం  (పనిమనిషి)  నుండి పీ.ఎం (ప్రైం మినిస్టర్) వరకూ ఎవరి పని వాల్లు చేస్తుంటారు. వాల్ల పనిలో వాల్లు నిష్ణాతులవౌతారు. పాలుపితికే పని పాలేరు చేసినంత నేర్పుగా ప్రైం మినిస్టర్ చేయలేక పోవచ్చు. అందుకే ఎక్కడనుండి నేర్చుకోవడానికీ ఏ మాత్రం నామోషీ ఫీల్ కాకుండా సమాజం నుండి ప్రతి సందర్భం నుండి నేర్చుకునే ప్రయత్నాన్ని ఓ ‘అలవాటు’గా మార్చుకుందాం.

– పల్లా కొండలరావు

గమనిక: జనవిజయం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

2 COMMENTS

  1. పల్లా కొండలరావు గారికి ! అభినందనలు!
    మీరు రాసిన ఎడిటోరియల్ కాలమ్ “నిరంతరం నేర్చుకుందాం!” చాలా బాగుంది. ప్రపంచమే ఒక విశ్వ విద్యాలయం . పుట్టిన ప్రతి ఒక్కడూ ఒక్కో విధ్యార్ధి అని పెద్దలు చెప్పారు. అది అక్షర సత్యం.

Leave a Reply to పేట యుగంధర్ Cancel reply

Please enter your comment!
Please enter your name here