ఆచి తూచి అడుగులు వేస్తున్న పవన్

0
27

పవన్ కళ్యాణ్. జనసేన అధినేత. సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తికాలం పోలిటిషియన్ గా మారారు. ఫక్తు రాజకీయాలకు భిన్నంగా తనదైన శైలిలో పవన్ అడుగులు వేస్తున్నారు. ప్రజారాజ్యం నేర్పిన అనుభవంతో పవన్ చాలా నేర్చుకున్నాడనిపిస్తోంది. తనను ఎవరు ఏ విధంగా విమర్శించినా, ఎవరు ఏ విధంగా అంచనా వేసినా, మీడియాలో ఏ కథనాలు వ్రాస్తున్నా పెద్దగా స్పందించని పవన్ ఆచరణలో మాత్రం ఆరితేరిన రాజకీయ నాయకులకంటే స్పష్టతతో ముందుకెలుతున్నారు. ముందు ఆయనను తక్కువ అంచనా వేసినవారు కూడా ప్రస్తుతం పవన్ ఏమి చేయబోతున్నారనేది ఆలోచించాల్సి వస్తోందని చెప్పక తప్పదు. కులపరమైన అంశాలలో ఆయన చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారు. తాను కులాన్ని నమ్ముకుని రాజకీయాలలోకి రాలేదంటూ వివరిస్తున్నారు. బి.జే.పీ , తెలుగుదేశం చేతిలో కీలుబొమ్మ అని విమర్శించిన వారికి ఒక్కసారిగా తెలుగుదేశం అధినేతపైనా, లోకేష్ అవినీతిపైనా మాట్లాడి ఆశ్చర్యపరచారు. ఈ నేపథ్యంలో పవన్ రూటు మార్చారని బి.జే.పే చేతిలో కీలుబొమ్మగా మారారాని బిజెపి ఆడిస్తున్నమేరకే తెలుగుదేశం పై ఆరోపణలు ప్రారంభించారని, బి.జే.పీ-జగన్-పవన్ ల మద్య రహస్య ఒప్పందం ఉందంటూ వివిధ పత్రికలలో, చానళ్ళలో కథనాలు వెలువడ్డాయి. ఒకింత ఇది నిజం అయికూడా ఉండవచ్చని అత్యధికులు అనుమానించాల్సిన పరిస్తితులు వచ్చాయి. అపుడు కూడా పవన్ ఆవేశపడలేదు. అనవసర ఆరోపణలకు వివరణలు ఇవ్వదలచుకోలేదు. ఆచరణలో తన పని తానూ చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పై వ్యక్తిగతంగా జగన్ ఆరోపణలు, పవన్ ఫ్యాన్స్ ప్రత్యారోపణలతో ఒక ఎపిసోడ్ ముగిసింది. ఈ సందర్భంగానూ పవన్ హుందాగా వ్యవహరించారు. కొన్ని విషయాలలో ఆవేశంగా వ్యవహరించే, సహజంగా ఆవేశ పరుడు అయిన పవన్ ఇలా సంయమనంతో ఉండడం… అదీ మీడియాకు గానీ, రాజకీయ విశ్లేషకులకు గానీ అంతుబట్టని, అంచనా వేయలేని విధంగా ముందడుగు వేసుకుంటూ పోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో సి.పి.ఎం, సి.పి.ఐ లతో కలసి పని చేస్తున్నారు. బహుశా ఎన్నికలలోనూ వామపక్షాలతోనే పొత్తు ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. బి.జే.పీ స్క్రిప్టుతో పనిచేస్తే వామపక్షాలతో కలసి పని చేయడం అన్నది జరుగదు. కనుక పరిశీలకుల అంచనాలు ఇక్కడా తప్పాయి. పవన్ తన స్వంత స్క్రిప్ట్ తోనే దీర్ఘాకాలిక వ్యూహంతోనే జనసేనను నడపాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని, అన్న చిరంజీవి కాంగ్రెస్ లోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేక పవన్ జనసేన స్థాపించారు. ప్రశ్నిస్తానన్న పవన్ బి.జే.పీ, చంద్రబాబు ల విజయానికి సహకరించారని విమర్శలు వచ్చాయి. ఏ.పీ కి స్పెషల్ స్టేటస్ విషయంలో బిజేపీ వైఖరిపై తీవ్రంగానే విమర్శించారు. పార్టీ నిర్మాణం విషయంలో కూడా పవన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎవరినిబడితే వారిని చేర్చుకునేందుకు, ముఖ్యంగా వ్యక్తిగత ప్రయోజనాలకోసం చేరేవారిని దగ్గరకు తీయకూడదని గట్టిగ తీర్మానిన్చుకున్నట్లుగా అనిపిస్తోంది. ఏకసేన అంటూ ఎన్ని వ్యంగ్యోక్తులు వినిపించినా ఆయన ఎవరిని పడితే వారిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ , తెలంగాణలో ప్రస్తుతం టీ.ఆర్.ఎస్ అధినేత కే.సి.ఆర్ పట్ల, ఆయన పార్టీ పట్ల సానుకూల ప్రకటనలు చేయడం వెనుక కూడా వ్యాహత్మక ఎత్తుగడ ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏ.పీ పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. తెలంగాణాలోనూ పార్టీ బలోపవేతానికి దీర్ఘాకాలిక వ్యూహంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా అందరూ ఊహించినట్లుగా …. ముఖ్యంగా కొన్ని మీడియాలలో వస్తున్నా కథనాలు, అంచనాలకు భిన్నంగా పవన్ వైఖరి ఉండడం గమనార్హం. మొత్తం మీద పవన్ అన్నింటా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. విభిన్నంగా ఉంటున్న ఆయన వైఖరి ప్రస్తుత రాజకీయాలలో ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.