అందరికీ ఆరోగ్యం అసాధ్యమా?!

0
479

అందరికీ ఆరోగ్యం అసాధ్యమా?!

‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు పెద్దలు. మహాభాగ్యంతో ఆరోగ్యం కొనుక్కోవచ్చనుకుంటున్నారు నేటి జనులు. అంటే ఆరోగ్యం పట్ల, దానికి సంబంధించిన అలవాట్లు పట్ల మనకంటే మన పెద్దలే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని తెలుస్తోంది. అందుకేనేమో ‘పెద్దల మాట చద్దన్నం మూట’ అన్నారు.

గతంతో పోలిస్తే టెక్నాలజీ, వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. విప్లవాత్మకమైన ఎన్నో మార్పులు ఈ రంగంలో ఆవిష్కృతమైనాయి. అనేక మొండి జబ్బులకు మందులు కనుక్కున్నారు. ఒకప్పుడు ప్రాణాంతకం అనుకున్న చాలా వ్యాధులు నేడు తేలికగా నయమవుతున్నాయి. కొన్ని వ్యాధులు కనిపించకుండా పోయాయి. అవయవాల మార్పిడి విజయవంతంగా జరుగుతోంది. మందులతో, ఆధునిక వైద్య సదుపాయాలతో మనిషి జీవిత కాలాన్ని పెంచుతున్నారు. అనేక విధాలుగా వైద్యరంగం, డాక్టర్లు మనిషికి సేవలు, మేలు చేస్తున్నారు.

మరోవైపు చూస్తే మన పెద్దలకీ, మనకీ ఆరోగ్య సమస్యలు రావడంలో, శారీరక,మానసిక శక్తిలో చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ విషయంలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. నాటి తరం మనుషుల శరీరాలకున్న శక్తి, మానసిక స్థైర్యం నేటితరం శరీరాలకు ఉండటం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. డాక్టర సంఖ్య, ఆసుపత్రుల సంఖ్య పెరుగుతున్నా, వైద్యరంగం అభివృద్ది అవుతున్నా రోగాల సంఖ్య, రోగుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. డాక్టర్ల శరీరాలకూ రోగాలు వస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులకు రోగాలు వస్తున్నా ఆ వైద్యమే చేస్తున్నారు. 25ఏండ్లకే షుగరు వచ్చేస్తున్నది. బిపి, గుండె జబ్బులు, కీళ్ళ వ్యాధులు, జుట్టు తెల్లబడడం, మానసిక అశాంతి, సెక్స్‌ సమస్యలు, చిన్నతనంలోనే కళ్ళజోళ్ళు పెట్టుకోవాల్సి రావడం…. ఇలా చెప్పుకుంటూ పోతే నేటిజనుల శరీరాలు రోగాలమయంగా ఉంటున్నాయి.

నేడు చాలావరకు మందులతో జీవితాల్ని నెట్టుకొస్తున్నారు. వైద్యం కూడా అత్యంత ఖరీదైన సరుకుగా మారింది. సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండటం లేదు. ‘ఆరోగ్యశ్రీ’ వంటి కొన్ని పథకాలు ఊరటనిస్తున్నా వైద్యం నేడు ఖరీదైన సరుకుగానే ఉన్నది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఏమి చేయాలి? అందరికీ ఆరోగ్యం అందడం అసాధ్యమా? ఈ విషయమై ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి? రాజకీయ నాయకులు ఏమి చేస్తున్నారు? ప్రజలకు రోగాల పట్ల అవగాహన సరైన పద్ధతిలో అందుతున్నదా? రోగాలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? రోగాలు వస్తే నివారణకు ఏ జాగ్రత్తలు పాటించాలి? ఏ రోగానికి ఎలాంటి మందు, ఎంత కాలం వాడాలి? ఆహారం, వ్యాయామం వంటి విషయాలో రావల్సిన మార్పులు ఏమిటి? రానున్న తరం వారికైనా ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు, వారసత్వం అందించలేమా? ఆరోగ్యం విషయంలో ఏ వైద్య విధానం మంచిది? ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వైద్యవిధానం మంచిదా? అందరు డాక్టర్లు ఒకే జబ్బుకి, ఒకే రకం మందులు ఎందుకు వ్రాయరు? మనం వాడే మందులన్నీ మంచివేనా? మందులు ఏ మోతాదులో వాడాలి? విదేశాలలో నిషేధించిన మందులు మన మార్కెట్‌లో అమ్ముతున్నారా? ఆరోగ్యానికి సంబంధించి ప్రజలలో కనీస ఛైతన్యం తీసుకువచ్చేందుకు, వివిధ వ్యాధులు, వాటిపట్ల వైద్య రంగం ఏమి చెపుతుందనే దానిపై ‘పల్లెప్రపంచం అంతర్జాలపత్రిక’ ద్వారా వ్యాసాలు, సలహాలు అందించాలని నిర్ణయించాము.

ప్రముఖ వైద్యులు వివిధ సమస్యలపై అవగాహన కలిగిచేందుకు, పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు అంగీకరించారు. వారందరికీ ‘పల్లెప్రపంచం’ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అభినందనలు. మీ సందేహాలు మాకు మెయిల్‌ చేయండి. ఆయా సమస్యలపై అవగాహన ఉన్న వైద్యుల చేత సమాధానాలు అందిస్తాము. ‘పల్లెప్రపంచం’ పాఠకులకు అందిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవలిసిందిగా విజ్ఞప్తి. మీ ఆరోగ్య సమస్యలను మెయిల్‌ ద్వారా అయితే palleprapancham@gmail.com అనే చిరునామాకు, లేఖ ద్వారా అయితే ఎడిటర్‌, పల్లెప్రపంచం అంతర్జాలపత్రిక, అంకుర హాస్పిటల్ ప్రక్కన , బాలాజీ నగర్‌ , ఖమ్మం-507002 కు పంపగలరు.

   – పల్లా కొండల రావు, ఎడిటర్‌

గమనిక: జనవిజయం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here